Sunday, May 21, 2023

నేను రాసిన 'అనుభూతి' అనే తెలుగు కవితకు శాంతకుమారి గారి కన్నడ అనువాదం..

అనుభూతి

ఎప్పుడూ
చూసే దృశ్యం
ఎప్పుడూ ఎదను తాకని భావమై మెరిసినప్పుడు
ఎప్పుడూ
పొందే ఆనందం
ఎప్పుడూ అందని అనుభూతిగా కలంలో కవితై  విరిసినప్పుడు
సరికొత్త అంతరంగం ఆవిష్క్రతమవుతుంది.
అది అనుభూతుల సందడిలో మునిగి తేలుతుంది.

నిన్నటి సంగతులన్ని
ఎదలో పదిలంగా ఉన్నాయి
రేపటి ఆశలన్ని
కలంలో కవితల్లా దాగున్నాయి
పర్వతాలు,నదులు
సముద్రాలు,అడవులూ
సమస్త ప్రకృతి అంతా
నాలోనే ఉంది ఊపిరిలా..
నాతోనే నడుస్తుంది నీడలా..


అనుభూతుల గమనంలో
జీవితంలో సగం గడిచాక
వెనక్కి తిరిగి చూసుకుంటే
సంతోషాల,సంతాపాల సందడిలో
ఎన్నో వెక్కిరింతలు గుండెను కత్తిరిస్తాయి.

జీవితమే అనుభూతై
ప్రయాణం చేస్తుంటాం..
అందరిలో ఒక్కరమై కదిలిపోతుంటాం..
కదలికలు లేని హృదయంతో
కన్నీరై కరిగిపోతుంటాం.
అనుభవాల సంద్రంలో అలలై పోతుంటాం.
రోజూ జరిగే
హృదయసాగరమధనంలో
ఎన్ని ఎన్నెన్ని
జ్ఞాపకాల దొంతరలు పురివిప్పుకుంటాయో
అనుభూతుల పులకరింతలు పలకరిస్తాయో
రెప్పల చాటున నిలిచిన
కలలతీరాలు గుప్పుమని ముందుకొచ్చి
నిలబడతాయో..

అవన్నీ
కవితలుగా..
పుటలు పుటలుగా..
కాలాలు మారినా
శతాబ్దాలు గడిచినా నిలిచిపోతాయి.
గాలిలో పరిమళించి పరవశమోందిస్తాయి.


     --- డా. తిరునగరి శరత్ చంద్ర

No comments:

Post a Comment